ఇంద్రకీలాద్రిపై శాకంబరీ మహోత్సవాలు
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే శాకంబరీ ఉత్సవాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు ఈనెల 29వ తేదీ వరకు కొనసాగుతాయి. దేవస్థాన యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ప్రకృతి స్వరూపిణి అయిన శ్రీ అమ్మవారికి ప్రకృతిలో లభించే వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు , పండ్లతో అలంకరించడమే శాకంబరీ ఉత్సవం అని పేర్కొన్నారు. భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు , రైతాంగం సుఖ సంతోషాలతో జీవించాలని కాంక్షిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాలు 2007వ సంవత్సరంలో అప్పటి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్.ఎస్. చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. అప్పట్లో దేవస్థాన అర్చక బృందం వరంగల్ భద్రకాళీ ఆలయంలో జరిగే క్రతువులు, శాస్త్ర ప్రమాణాలను పరిశీలించిన అనంతరం ఇంద్రకీలాద్రిపై ఈ సంప్రదాయాన్ని ప్రారంభించిచారు. నాటి నుండి నేటి వరకు గత 19 సంవత్సరాలుగా దుర్గమ్మ సన్నిధిలో ఈ శాకంబరీదేవి పూజలు నిరంతరాయంగా, వైభవంగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఎల్ నినో (El Niño) ప్రభావం వల్ల వర్షాలు లేక మార్కెట్లో కూరగాయల లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ, దేవస్థాన సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాలకు వెళ్లి రైతులు, వ్యాపారుల నుండి విరాళాలు సేకరించారు. సుమారు 32 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు ఇంద్రకీలాద్రికి చేరుకున్నాయి.