newsseals.com

తెలంగాణ రాష్ట్రానికి 1.56 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయించండి

July 29, 2026 · VijayaBhaskar

న్యూఢిల్లీ : తెలంగాణ‌కు ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11.56 లక్షల ఇండ్ల‌ను కేటాయించాల‌ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ ను క‌లిసి విన్న‌వించారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త‌ర్వాత పేద‌ల‌కు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వ‌డానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలువురు ఎంపీలతో కలిసి కృషి భ‌వ‌న్‌లో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాన్ని వివ‌రించారు. గత ప్రభుత్వం PMAYG ను వినియోగించు కోక పోవ‌డంతో రాష్ట్రంలో గ‌త ప‌దేళ్లు పేద‌లు సొంత ఇండ్లు నిర్మించు కోలేక పోయారని, ఇప్పుడు తీవ్ర డిమాండ్ నెల‌కొంద‌ని తెలిపారు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వ‌హించిన స‌ర్వేలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించిన‌ట్లు ముఖ్యమంత్రి వివరించారు. సాధ్య‌మైనంత త్వ‌రగా తెలంగాణ‌కు ఇళ్లు కేటాయించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. ఎల్‌నినో, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేప‌థ్యంలో విక‌సిత్ భార‌త్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)లో అద‌న‌పు ప‌నులను చేర్చాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. వ‌ర్షాభావంతో ప‌నులు లేనందున ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీల‌కు జీవ‌నోపాధులు మెరుగుప‌ర్చేందుకు, పంటల వైవిధ్యీకరణ ప్రోత్సాహానికి అద‌న‌పు ప‌నులను చ‌ట్టంలో చేర్చాల‌ని కోరారు.

రైతులు త‌మ భూముల్లో కూర‌గాయ‌ల పందిళ్లు, ప‌శుగ్రాస ప్లాట్ల అభివృద్ధి, మల్బరీ తోటల సాగు, పట్టు పురుగుల పెంపకం షెడ్లు, ఇళ్ల స‌మీపంలో ఆకు కూర‌లు, కూర‌ గాయ‌ల తోట‌లు, వెదురు వ‌నాలు పెంచుకునే ప‌నులను వీబీ జీ రామ్ జీలో చేర్చాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. కొండ ప్రాంతాల‌తో పాటు కొండ వాలుల్లో నీటి నిల్వ చేసుకునే కంద‌కాలు, ఇప్పటికే ఉన్న ప్లాంటేషన్లు, పండ్ల తోటల్లో తేమ ర‌క్ష‌ణ‌కు కంద‌కాల నిర్మాణం, వ‌ర‌ద‌లు, ఇసుక మేట‌ల‌తో దెబ్బ‌తిన్న భూముల పున‌రుద్ధ‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన ప‌నులు వీబీ జీ రామ్ జీలో చేప‌ట్టాల‌ని కోరారు.

ఉపాధి హామీ పథకం కింద ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ స‌మ‌యంలో 90 రోజుల వరకు ప‌నులు చేసే అవ‌కాశం ఉండేద‌ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వీబీ జీ రామ్ జీ లోనూ అందుకు అనుమ‌తి ఇప్పించాల‌ని కోరారు. స్థానిక అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే ఇత‌ర ప‌నుల‌ను వీబీ జీ రామ్ జీలో చేర్చాల‌న్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి ప‌నుల విష‌యంలో సమస్యలను శివ‌రాజ్ సింగ్ చౌహాన్ గారి దృష్టికి తీసుకెళ్లామ‌ని, వాటి ప‌రిష్కారానికి వారు సానుకూలంగా స్పందించార‌ని ముఖ్యమంత్రి తెలిపారు.

Related News