చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్ చేస్తానని వెల్లడించారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. పలు అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందన్నారు. రూ.3.30 కోట్ల సమగ్ర ఘన వ్యర్ధాల నిర్వహణ, మెటిరియల్ రికవరీ ప్లాంట్ ప్రారంభించాం అని తెలిపారు. వ్యవసాయ ఫీడర్ల కోసం 14-15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను కూడా స్టార్ట్ చేశామన్నారు. రూ.10 కోట్లతో 35 పాఠశాలల్లో వివిధ అభివృద్ధి పనులు, ఎన్ఎఏసీ భవనంలో మానస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించుకున్నామని తెలిపారు. రూ.2 కోట్లతో స్థానిక ఉత్పత్తులను విక్రయించుకునేలా ఆధునిక రైతు బజార్ నిర్మిస్తాం అన్నారు. రూ.13 కోట్ల వ్యయంతో కుప్పం ఆర్డీఓ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయాలను కూడా నిర్మిస్తున్నాం అని తెలిపారు సీఎం.
అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రూ.15 కోట్ల వ్యయంతో చేపడతామన్నారు. రూ.8 కోట్ల వ్యయంతో కుప్పం మున్సిపాలిటీ పరిధిలో హైమాస్ట్ వీధి దీపాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం కూడా పూర్తి చేస్తున్నాం. అన్నారు. రూ.184 కోట్ల వ్యయంతో మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ యుటిలిటీని నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. హంద్రీనీవా సుజల స్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా బీరువాని పల్లె వద్ద రూ.45 కోట్లతో ఓ రిజర్వాయర్ నిర్మిస్తామని సంచలన ప్రకటన చేశారు సీఎం.
మల్లనూరు దగ్గర రూ.27 కోట్ల వ్యయంతో ఓ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తాం అన్నారు. రూ. 16 కోట్ల వ్యయంతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మించేలా, హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్లస్ట్రర్ ఏర్పాటు చేయబోతున్నాం. కుప్పం మార్కెట్ యార్డులో రూ.2.50 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశాం అన్నారు.






