చెన్నై : డీఎంకే పార్టీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా తమిళనాడు టీవీకే సర్కార్ ప్రతిపాదించిన కొత్త సచివాలయం ఎవరి కోసమని ప్రశ్నించారు. బీచ్ సమీపంలో కొత్త సచివాలయ ప్రణాళికను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. సముద్రాన్ని చూస్తూ కూర్చోవడానికి ఆ భవనం కాదంటూ ఎద్దేవా చేశారు. మత్స్యకారుల జీవనోపాధిని, వారి నివాస ప్రాంతాన్ని దెబ్బతీస్తూ రద్దీగా ఉండే ప్రాంతంలో కొత్త సచివాలయం అవసరం లేదని మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చెన్నైలోని మెరీనా బీచ్‌కు సమీపంలో ఉన్న ఫోర్‌షోర్ ఎస్టేట్‌లో కొత్త సచివాలయ-అసెంబ్లీ కాంప్లెక్స్‌ను నిర్మించాలన్న టీవీకే (TVK) ప్రభుత్వ ప్రతిపాదనను డీఎంకే అధ్యక్షుడు తీవ్రంగా వ్యతిరేకించారు.
మత్స్యకారుల జీవనోపాధిని , వారి నివాస ప్రాంతాన్ని నాశనం చేస్తూ, రద్దీగా ఉండే ప్రాంతంలో కొత్త సచివాలయం అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అటువంటి కాంప్లెక్స్ ముఖ్యమంత్రి పని చేసుకోవడానికి ఉద్దేశించినదే తప్ప, సముద్రాన్ని చూస్తూ కూర్చోవడానికి కాదని ఆ ద్రావిడ పార్టీ అధినేత ఎద్దేవా చేశారు. తమ ప్రాంతంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న మత్స్యకారుల ఆందోళనకు తన పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.మద్దతు ఇచ్చే పార్టీల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ, కొత్త సచివాలయ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వును ఉపసంహరించుకోని టీవీకే ప్రభుత్వ అహంకారాన్ని మేము అణచివేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.






