హైదరాబాద్ : మార్కెటింగ్ శాఖలో కొనసాగుతున్న ఇంజినీరింగ్ పనులన్నింటికీ స్పష్టమైన గడువులు నిర్ధారించి, ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశించారు. శాఖలో ఇంజినీరింగ్ సిబ్బంది కొరత వల్ల పనులు ఆలస్యం అయితే, అవసరమైతే ఆ పనులను ఆర్ అండ్ బి (R&B), పంచాయతీరాజ్ (PR) శాఖలకు అప్పగించి వేగవంతంగా పూర్తి చేయాలని ఏపీసీకి సూచించారు. శాఖకు కేటాయించిన ఇంజినీర్లు విధులకు హాజరు కాకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి పనికి టైమ్‌బౌండ్ కార్యాచరణ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.
మార్కెట్ యార్డుల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు, ఇతర సమస్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని శాఖ కార్యదర్శిని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులు, గోదాముల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేయడాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. వచ్చే నెలలోగా అన్ని మార్కెట్ కమిటీల నుంచి ఫీజిబిలిటీ నివేదికలు సేకరించి, సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభించి, నవంబర్ నాటికి అన్ని మార్కెట్ యార్డులు, గోదాముల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కోహెడ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి సంబంధించి ఏజెన్సీ తయారుచేసిన డిజైన్లను వచ్చే వారంలోగా ఖరారు చేసి, ముఖ్యమంత్రి గారి అనుమతితో వచ్చే నెలలో నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మార్కెటింగ్ శాఖలో ఇంజినీరింగ్, పరిపాలన విభాగాల్లో ఎక్కడ సిబ్బంది కొరత ఉందో వెంటనే గుర్తించి, అదనపు పోస్టుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. శాఖ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని భర్తీ చేసి, పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.





