హైదరాబాద్ : మెటీరియల్ అనుమతుల విషయంలో రోడ్డు కాంట్రాక్టర్లను వేధించవద్దని మైనింగ్ అధికారులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. రోడ్డు ప్రాజెక్టులకు అవసరమైన మెటల్ (కంకర) ,ఇతర నిర్మాణ సామగ్రి సేకరణకు సంబంధించిన అనుమతుల విషయంలో కీలక సూచనలు చేశారు. రోడ్డు నిర్మాణానికి ఇసుక, మట్టి, మెటల్ అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడే వారిని వదిలేసి, చిన్న, నిజాయితీ గల కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు.
మైనింగ్ సంబంధిత అనుమతులు పొందడంలో రోడ్డు కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మైనింగ్, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామితో కలిసి శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మేఘా రెడ్డి, TGMDC మేనేజింగ్ డైరెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ (HAM రోడ్లు) బి.వి. రావు, మైనింగ్ కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకు వచ్చారు. రోడ్డు పనులు చేపడుతున్న చిన్న కాంట్రాక్టర్లపై మెటీరియల్ విలువకు 10 రెట్లు జరిమానా విధించడం సమంజసం కాదని మంత్రులు అభిప్రాయపడ్డారు.
కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులకు బాధ్యులైన అధికారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని కోమటిరెడ్డి కోరారు. రూ. 5 కోట్ల విలువైన అంశానికి సంబంధించి రూ. 54 కోట్ల జరిమానా విధించడం దారుణమని పేర్కొన్న కోమటిరెడ్డి, కాంట్రాక్టర్లు తమ ఒప్పందాల ప్రకారం చెల్లింపులు చేస్తున్నారని చెప్పారు.





