newsseals.com

చెన్నై ఎయిర్ పోర్టులో నాప్ కిన్ వెండింగ్ మిష‌న్లు

September 5, 2026 · VijayaBhaskar

చెన్నై : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని మహిళల విశ్రాంతి గదులన్నింటిలో 36 కొత్త శానిటరీ నాప్‌కిన్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఇటీవల చెన్నై నుండి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న లతా రావు విమానాశ్రయంలో వేచి ఉన్నప్పుడు అనుకోకుండా పీరియ‌డ్ రావడంతో తాను ఎదుర్కొన్న ఇబ్బందికరమైన పరిస్థితిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సాధారణంగా ప్రయాణాల్లో తన హ్యాండ్‌బ్యాగ్‌లో శానిటరీ నాప్‌కిన్‌లను ఉంచుకుంటానని, కానీ ఈసారి పొరపాటున వాటిని తీసుకోవడం మర్చి పోయానని వాపోయారు. తనకు నాప్‌కిన్ అవసరమని గుర్తించినప్పుడు టెర్మినల్ లోపల ఎక్కడైనా అవి దొరుకుతాయేమోనని ఆమె అక్కడి మహిళా ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. అయితే గతంలో మహిళల విశ్రాంతి గదుల్లో అందుబాటులో ఉన్న శానిటరీ నాప్‌కిన్ వెండింగ్ మిషన్లు ప్రస్తుతం పని చేయడం లేదని వారికి తెలిసింది.

తక్షణమే శానిటరీ నాప్‌కిన్ దొరకక పోవడంత ఆమె గేట్ 1 నుండి గేట్ 7 దగ్గర ఉన్న ఫార్మసీకి హడావిడిగా వెళ్లారు. కానీ ఆ సమయంలో ఫార్మసీ ఉద్యోగి కౌంటర్ వద్ద లేరు. కొన్ని నిమిషాల పాటు ఆందోళనతో వేచి చూసిన తర్వాత, ఉద్యోగి తిరిగి రాగానే ఆమె ఒక శానిటరీ నాప్‌కిన్‌ను కొనుగోలు చేసి, తిరిగి తన బోర్డింగ్ గేట్ వద్దకు పరుగున వెళ్లారు. అప్పటికే బోర్డింగ్ ప్రక్రియ మొదలై పోవడంతో ఆమె తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. రుతుక్రమం , దాని పరిశుభ్రత గురించి బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడానికి ఆమె ఈ సంఘటనను ఒక అవకాశంగా తీసుకున్నారు. రుతుక్రమం అనేది మహిళలు సహజంగా ఎదుర్కొనే శారీరక ప్రక్రియ అని, దాని గురించి చర్చించడంలో సిగ్గు పడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. గ్యాస్ స్టవ్ ఆర్పేశామా లేదా ఇంటి తాళాలు తీసుకున్నామా అని ఎలాగైతే చూసుకుంటారో, అలాగే ప్రయాణానికి బయలుదేరే ముందు శానిటరీ నాప్‌కిన్‌లను కూడా తప్పనిసరి వస్తువుగా భావించి, వాటిని వెంట తీసుకున్నారో లేదో సరి చూసుకోవాలని మహిళా ప్రయాణికులకు ఆమె సూచించారు.

ఆమె పోస్ట్ చెన్నై విమానాశ్రయంలో అత్యవసర రుతుస్రావ పరిశుభ్రత ఉత్పత్తుల లభ్యతపై కూడా ప్రశ్నలను లేవనెత్తింది. ఈ విషయంపై స్పందిస్తూ, చెన్నై విమానాశ్రయ అధికారులు ఇంతకు ముందు మహిళల విశ్రాంతి గదులలో శానిటరీ నాప్‌కిన్ వెండింగ్ మెషీన్లు పని చేస్తున్నాయని తెలిపారు. అయితే, ఆ మెషీన్లను దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపి వేశారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళా ప్రయాణికులు శానిటరీ నాప్‌కిన్‌లను పొందేలా చూసేందుకు ఒక మధ్యంతర ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్త ఏర్పాటులో భాగంగా సెప్టెంబర్ నెలాఖరులోగా చెన్నై విమానాశ్రయంలోని మహిళల విశ్రాంతి గదులన్నింటిలో 36 శానిటరీ నాప్‌కిన్ వెండింగ్ మెషీన్‌లను ఏర్పాటు చేయనున్నారు.

Related News