టీసీఎస్ హైపర్ వాల్ట్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు టీసీఎస్–హైపర్‌వాల్ట్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రూ.70 వేల కోట్ల పెట్టుబడి.. 7 వేల ఉద్యోగాలు.. 250 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యంతో ప్రపంచస్థాయి AI మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. AI విప్లవంలో హైదరాబాద్‌ను ప్రపంచానికి నాయకత్వం వహించే నగరంగా నిలపాలన్న మా సంకల్పానికి ఇది మరో చారిత్రాత్మక ముందడుగుగా ఆయన అభివర్ణించారు.
ఫ్యూచర్ సిటీపై మనం కన్న కలకు ఈ ప్రాజెక్టు బలమైన పునాది కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం. తెలంగాణ రైజింగ్ విజన్–2047లో భాగంగా తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన, భవిష్యత్ సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణపై నమ్మకంతో ఇంత భారీ పెట్టుబడికి ముందుకొచ్చిన టీసీఎస్–హైపర్‌వాల్ట్ ప్రతినిధులకు నా అభినందనలు తెలిపారు. ఇది కేవలం పెట్టుబడి కాదు.. తెలంగాణ భవిష్యత్తుపై ప్రపంచం ఉంచిన నమ్మకం అని పేర్కొన్నారు.