newsseals.com

బాబా రామ్ దేవ్ అనుచ‌రుడు బాల‌కృష్ణ‌కు బిగ్ రిలీఫ్

September 8, 2026 · VijayaBhaskar

డెహ్రాడూన్ : ప్ర‌ముఖ యోగా గురు రామ్ దేవ్ బాబా అనుచ‌రుడిగా గుర్తింపు పొందిన ప‌తంజ‌లి వ్యాపార సంస్థ‌ల సీఈఓగా ఉన్న బాల‌కృష్ణ‌కు భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌పై గ‌తంలో నకిలీ పత్రాలకు సంబంధించి కేసు న‌మోదైంది. తాజాగా ఈ కేసులో రామ్‌దేవ్ సహచరుడు బాలకృష్ణ నిర్దోషిగా విడుదల అయ్యారు. నకిలీ విద్యా , ఇతర పత్రాల ఆధారంగా పాస్‌పోర్ట్ పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 ఏళ్ల నాటి కేసులో డెహ్రాడూన్‌లోని సీబీఐ (CBI) కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. బాలకృష్ణకు నకిలీ పత్రాలను సమకూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సహ నిందితుడు నరేష్ చంద్ర ద్వివేదిని కూడా ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీబీఐ) కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

బాలకృష్ణ నేపాలీ పౌరుడని, నకిలీ పత్రాలను ఉపయోగించి భారతీయ పాస్‌పోర్ట్ పొందారని వచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ 2011లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. కోర్టు తీర్పు తర్వాత న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ సుదీర్ఘ న్యాయ ప్రక్రియ ఎంతో శ్రమతో కూడుకున్నదని, ఈ సమయంలో తాను అవమానం, అపఖ్యాతి , ఇతరుల నుండి వచ్చిన ప్రతికూలతలను భరించాల్సి వచ్చిందని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు న్యాయ‌మే గెలిచింద‌ని పేర్కొన్నారు.

Related News