newsseals.com

ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌లు పార్టీకి ప‌ట్టుకొమ్మ‌లు

September 8, 2026 · VijayaBhaskar

విజ‌య‌వాడ : మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి కొత్త పార్టీ పెడుతున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. 5 అంశాలే త‌మ పార్టీ మేనిఫెస్టో అని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో ఖర్చు కన్నా ఆదాయం తక్కువగా ఉంది. 80 శాతం మంది ప్రజలకు ఈ పరిస్థితి ఉంది. ఖర్చులు ఎలా తగ్గించాలి, ఆదాయం ఎలా పెంచాలి. 80 శాతం మంది ప్రజలు ఏదో ఒక అప్పుల ఊబిలో ఇరుక్కుని ఉన్నారు. వీరంతా ఎలా అప్పుల ఊబిలో నుంచి బయట పడాలి, ఆదాయ వనరులను ఎలా పెంచాలి అనే దానిపై ఫోక‌స్ పెడ‌తాం. ఉప్పు, పప్పు నుంచి కరెంటు బిల్లులు.. అన్నీ పెరుగుతూ వస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా తగ్గించాలని చర్చిస్తాం అన్నారు. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు రూ. లక్షా 2 వేల కోట్ల అప్పు ఉంటే.. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో పది-పన్నెండు లక్షల కోట్లకు పెరిగిందని అంటున్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు ఉంది..? గ్యారెంటీలు ఎంత? కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు ఎంత? ఇవన్నీ తీసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 12 లక్షల కోట్ల అప్పు ఉంటే.. వీళ్ళు రాష్ట్రాభివృద్ధికి ఏం చేశారు. ఇది ఎవరి జేబుల్లోకి ఎంత పోయిందని ప్రశ్నిస్తున్నాను.

అమరావతి క్యాపిటల్ ను నేను వ్యతిరేకించటం లేదు. శివరామకృష్ణన్ నివేదిక ప్రకారం రాజధాని లేదు అని గుర్తించి, దానిని అనుసరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పాను. సుమారు రూ. 70 వేల కోట్లు రాజధాని మీద ఖర్చు పెట్టిన తర్వాత, అమరావతిని మార్చాలని అనుకోవడం అవివేకం. ఇష్టం ఉన్నా, లేకపోయినా అదే రాజధాని, వ్యతిరేకించ కూడదు. రాజధాని అభివృద్ధి పేరుతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయవద్దు. ప్రభుత్వంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి, అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకురండి, ప్రజల డబ్బులను దుర్వినియోగం చేయొద్దు అని చెబుతున్నాను. ఈ ప్రభుత్వాలు జెన్-జీకి ఎందుకు భయపడుతున్నాయి..? యువత, రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ తిరగబడుతోంది. ప్రభుత్వాలు చేస్తున్న తప్పుడు పనులను జెన్ – జీ ప్రశ్నిస్తున్నారు కాబట్టే, ప్రభుత్వాలు భయపడతూ ఉన్నాయి. కొత్తగా పెట్టబోయే పార్టీలో, ఇవాల్టికి 22 ఏళ్ళు పూర్తి అయినవాళ్ళకి, 2029 నాటికి 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటే, వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, అది అసెంబ్లీగానీ, పార్లమెంటుగానీ, స్థానిక ఎన్నికలుగానీ.. 25-40 ఏళ్ళ యువతకు అన్ని పదవుల్లో 66 శాతం సీట్లు కేటాయిస్తానని ప్ర‌క‌టించారు. అది ఏ కులం అయినా కావచ్చు. సామర్థ్యం ఉన్న తెలివైన యువతను ప్రోత్సహిస్తూ.. 66 శాతం వారికి కేటాయిస్తామ‌న్నారు.

వైఎస్ఆర్ రైతులకు ఉచిత కరెంటు ఇచ్చారు. వాస్తవానికి, రైతులకుగానీ, గృహావసరాలకు గానీ ఉచిత విద్యుత్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానా మీద భారం పడకుండా, కేంద్రం ఇచ్చే సబ్సిడీతో, రాష్ట్రం కూడా సబ్సిడీ ఇస్తే,వాటితో సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే, నామినల్ పెట్టుబడితో, ప్రజలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు. ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క రైతుకు ఉచితంగా కరెంటు ఇస్తాం. మా పార్టీ ఈ విధంగా ప్రయాణం చేస్తుంది. గత ప్రభుత్వాలు ఎందుకు ఇలా పనిచేయలేదు. ఎందుకంటే, విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీల నుంచి కరెంటు కొనుగోలు చేస్తేనే.. రాజకీయ పార్టీలకు, అధికార పార్టీకిగానీ కమీషన్లు వస్తాయి. ఆ విధంగా రేట్లు పెంచేసి, తద్వారా కమీషన్లు గుంజుకుంటాయి. ఇవేవీ లేకుండా, ఏపీని సోలార్ రాష్ట్రంగా మారుస్తాం. ప్రజలే ప్రభుత్వానికి కరెంటు అమ్మే పరిస్థితిని తీసుకువ‌స్తామ‌న్నారు. పరిశ్రమలకు తప్ప మిగతా వారికి ఉచిత కరెంటు ఇస్తాం అన్నారు.

ధరలు తగ్గించాలిః ధరలు తగ్గించాలంటే.. పెట్రోలియం ప్రొడక్ట్స్ ధరల ప్రభావం ఉంటుంది. వీటి ధరలు పెరిగినంతకాలం.. మనం నిత్యావసర సరుకుల ధరలు తగ్గించలేం. మన రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా ఏపీ, తెలంగాణలో జీఎస్టీ 31 శాతం విధిస్తున్నారు. అతి తక్కువ అరుణాచల్ ప్రదేశ్ లో 15 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో 31 శాతం జీస్టీ కాకుండా, రూ. 4 అదనంగా వసూలు చేస్తున్నారు. అంటి, ఇంచుమించుగా 40 శాతం పన్నులు విధిస్తున్నారు. 35 నుంచి 15 శాతానికి పన్నులు తగ్గించగలిగితే..రాష్ట్ర ఆదాయం కోల్పోయినా ఫర్వాలేదు, ప్రజల ఆదాయం పెరగాలంటే, ఇది చేయాలి. పెట్రోలు ధర రూ. 100 కు మించకుండా చేసి, నిత్యావసరాల రవాణా ఖర్చులు తగ్గించి, నిత్యావసరాల ధరలు తగ్గించి, ప్రజల ఆదాయాన్ని పెంచాలని అన్నారు.

ఈ రాష్ట్రంలో నీటి నిల్వ సామర్థ్యం 1000 టీఎంసీలు. వాస్తవానికి, మనకు అవసరం-1500 టీఎంసీలు ఉంది. 1200 టీఎంసీలు ఉన్నా.. తెలంగాణ భాగస్వామ్యం వల్ల మనకు రావటం లేదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అడిగితే, ఎల్ నినో, వస్తుంది. సాగునీరు, తాగు నీరు ఇబ్బంది వస్తుంది అని చెబుతున్నారు. వరి పంట వేయొద్దు అని చెప్పటం తప్పు. మీరు నిజంగా విజినరీ అయితే, 1000 టీఎంసీల కెపాసిటీని.. మూడింతలు పెంచి ఉండేవాళ్లు. పెంచితే, రెండేళ్లు నిరంతరాయంగా కరవు వచ్చినా మనకు సాగునీరు, తాగు నీరుకు ఇబ్బంది రాదు. దీనికి ట్రిబ్యునళ్ళు అంగీకరిస్తాయా అని అడగవచ్చు. మరి, ఎవర్ని అడిగి తెలంగాణ, కర్ణాటకలో ప్రాజెక్టులు కట్టారని ప్ర‌శ్నించారు. సముద్రంలో కలిసే నీరు 4000 టీఎంసీలు ఉంది. వర్షాలు బాగా పడితే 5500 టీఎంసీలు సముద్రంలో కలిసి పోతున్నాయి. వీటిని రిజర్వాయర్లలోకి ఎలా మళ్లించాలి, ఎలా సాగు, తాగు నీటిగా మార్చుకోవాలి అన్నది ఆలోచించాలి. మా పార్టీ అధికారంలోకి వస్తే.. 1000 టీఎంసీల కెపాసిటీని మూడింతలు పెంచి, అంటే 3000 టీఎంసీలు నిల్వ చేసే సామర్థ్యాన్ని పెంచి, రెండు, మూడేళ్లు కరవు వచ్చినా, రైతులకు సాగు, ప్రజలకు తాగు నీటికి ఇబ్బంది పడకుండా చేస్తాం అన్నారు విజ‌య సాయి రెడ్డి. ఈ రెండు రాజకీయ పార్టీలు మారవు. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నంత వరకూ నీళ్ళు దొరకవు. ఎల్ నినోలు వస్తానే ఉంటాయి. వ్యవసాయం దెబ్బతింటుంది. రైతులు బతకరు. ఒక పార్టీని మరొకరు నిందించుకుంటూనే కాలం వెళ్ళబుచ్చుతారు. అందుకే ప్రత్యామ్నాయ పార్టీ అవసరం అన్నారు.

Related News