newsseals.com

సెప్టెంబర్ 17 నుండి అసలైన యుద్ధం : మల్లన్న

September 8, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : కేవ‌లం రెండు సంవ‌త్స‌రాల‌లో బీసీ రాజ్యం తీసుకు వ‌స్తానని ప్ర‌క‌టించారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్ర‌క‌టించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం మల్లన్న అధ్యక్షతన జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సమావేశ ప్రారంభంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీ కుమార్ యాదవ్ సమావేశ ఎజెండాను ప్రవేశపెట్టి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై వివరించారు. ఈ సందర్భంగా మాదం రజినీ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణలో బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేశార‌న్నారు. మల్లన్న ప్రారంభించిన 7200 తీన్మార్ మల్లన్న టీం ఉద్యమం నుంచి నేడు పార్టీ ఏర్పాటు వరకు సాగిన పోరాటాలు ప్రజల్లో ప్రత్యామ్నాయ రాజకీయాలపై విశ్వాసాన్ని పెంచాయని అన్నారు. కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలను తయారు చేసుకుని, భారీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న పార్టీ ఆవిర్భవించి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా అదే రోజు నుంచి బీసీల రాజకీయ అధికారం సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా మహా పాదయాత్రను పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్రను ప్రతి కార్యకర్త తన సొంత కార్యక్రమంగా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి తెలంగాణలో అసలైన రాజకీయ యుద్ధం ప్రారంభం కానుందని ప్రకటించారు. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలు కొద్దిమంది రెడ్డి, వెలమ వర్గాల చేతుల్లో బందీగా మారాయని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు జనాభాలో అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ అధికారంలో మాత్రం వారికి తగిన ప్రాతినిధ్యం దక్కలేదని అన్నారు. ఈ పాదయాత్రతో బీసీలకు రాజ్యాధికారం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల్లో బీసీ రాజ్యం తెస్తాన‌ని మల్లన్న స్పష్టం చేశారు. బీసీలు కేవలం ఓటు బ్యాంకులుగా ఉండే పరిస్థితిని మార్చి, పాలక వర్గంగా ఎదిగే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి బస్తీ, ప్రతి కుటుంబానికి బీసీల రాజ్యాధికారం అవసరాన్ని వివరించే బాధ్యతను పార్టీ శ్రేణులు తీసుకోవాలని సూచించారు.“80 ఏండ్ల దోపిడి పాలనకు ముగింపు” పలకడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ లక్ష్యమని మల్లన్న పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి అధికార, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై రెడ్లు, వెలమ వర్గాలు పెత్తనం కొనసాగించాయని, బీసీల శ్రమతో సంపద సృష్టి జరిగితే అధికారం మాత్రం ఆ వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమైందని అన్నారు. ఆ దోపిడీ పాలనకు చరమగీతం పాడేందుకే టీఆర్పీ పుట్టిందన్నారు. “తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ టీఆర్పీ” అని పేర్కొంటూ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బీసీలకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. రాజ్యాధికారం అనే నినాదంతో నిర్మితమైన పార్టీగా టీఆర్పీ ఎదుగుతోందని, భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలను నిర్ణయించే శక్తిగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

పాదయాత్ర కేవలం రాజకీయ కార్యక్రమం కాదని, సామాజిక చైతన్య యాత్ర అని మల్లన్న అన్నారు. ఈ యాత్రలో బీసీలకు జరిగిన అన్యాయాలు, అవకాశాల దోపిడీ, రాజకీయ అధికార కేంద్రీకరణ గురించి గడప గడపకు వివరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర నాయకుల నుంచి గ్రామ స్థాయి కార్యకర్తల వరకు అందరూ సమన్వయంతో పని చేసి పాదయాత్రను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. రెడ్లు, వెలమల దోపిడి లెక్కలు ప్రతి ఇంటికి వివరిస్తూ ప్రజల్లో కదలిక తీసుకొస్తాం అని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా అధికారo, ఆస్తులు, కాంట్రాక్టులు, భూములు,పదవులు రెడ్లు, వెలమల చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయని, ఆ అసమానతల వాస్తవాలను బీసీ ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. బీసీలకు దక్కాల్సిన అవకాశాలు ఎలా దూరమయ్యాయో గ్రామ గ్రామాన వివరించే కార్యక్రమం చేపడతామని తెలిపారు.

టీఆర్పీ సునామీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గల్లంతు” అవుతాయని మల్లన్న అన్నారు. ప్రజల సమస్యలపై నిజాయితీగా పోరాడే రాజకీయ శక్తిగా టీఆర్పీ నిలిచిందని, ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణలు ఏర్పడతాయని చెప్పారు. “7200 నుండి టీఆర్పీ ఏర్పాటు వరకు అనేక ప్రజా పోరాటాలు” నిర్వహించామని గుర్తు చేశారు. ఉద్యమాల ద్వారా ప్రజల మధ్య విశ్వసనీయత సంపాదించిన తర్వాతే పార్టీ ఏర్పాటు చేశామని తెలిపారు. పార్టీ ఏర్పడిన అనతి కాలంలోనే వేలాది మంది కార్యకర్తలు సిద్ధమయ్యారని, లక్షలాది మంది ప్రజల మద్దతు లభించిందన్నారు.

Related News