భావప్రకటన స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం : టీయుడబ్ల్యూజే
హైదరాబాద్ : దేశంలో భావాప్రకటన స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని, మీడియా స్వేచ్ఛను హరించేందుకు పాలకులు ప్రయత్నిస్తే ప్రజాస్వామికావాదుల నుండి ప్రతిఘటన తప్పదని జర్నలిస్టులు హెచ్చరించారు. ఢిల్లీలో విధినిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులపై పోలీసుల దాడి, అక్రమ కేసు, అరెస్టును నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) ఆధ్వర్యంలో జర్నలిస్టులు, ప్రజాస్వామికావాదులు కొవ్వుత్తులతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బషీర్ బాగ్ లోని టీయుడబ్ల్యూజే కార్యాలయం నుండి ప్రాంభమైన ఈ నిరసన ప్రదర్శన, నిజాంకాలేజీ మీదుగా జగజీవన్ రాం విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు సీనియర్ పాత్రికేయులు, ప్రజాస్వామికవాదులు ప్రసంగించారు. ప్రజాస్వామిక దేశంలో పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను, స్వేచ్ఛను ఖునీ చేస్తూ, తమకు అనుకూలమైన విధానాలను ఎన్డియే ప్రభుత్వం అవలంబించడం అప్రజాస్వామికమని సీనియర్ పాత్రికేయులు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్ ఆందోళన వ్యక్తం చేసారు.
ఐదు రోజుల క్రితం ఢిల్లీలో విధినిర్వహణ లో ఉన్న మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన మహిళా జర్నలిస్టులు షాహిన్ ఖాన్, నఫీజా ఖాన్ లపై పోలీసులు దాడి చేయడం, వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను, జర్నలిస్టుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఈ సభలో పాల్గొన్న పలువురు సూచించారు. జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు, అక్రమ అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు అన్నారు. మహిళా జర్నలిస్టులకు న్యాయం చేయడంతో పాటు, ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ప్రదర్శనలో ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ. మాజీద్, జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, కె. అజిత, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షురాలు అత్తలూరి అరుణ, టీయుడబ్ల్యూజే మహిళా జర్నలిస్ట్స్ విభాగం కన్వీనర్ రాజేశ్వరి, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు సంధ్య, సీనియర్ పాత్రికేయులు వనజ, స్వప్న, విమల, టీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్, బి. కిరణ్ కుమార్, హెచ్.యు.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్ బాబు, అశోక్, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి, తెలంగాణ ఉర్దూ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గౌస్ మోహియొద్దీన్ లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.