newsseals.com

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై స్పష్టత

September 11, 2026 · VijayaBhaskar

హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న పండిట్లు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల పోస్టుల అప్‌గ్రేడేషన్‌కు సంబంధించిన అంశాలపై సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ స్ప‌స్టత ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తెలంగాణ శాసనమండలిలో శాసన మండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న , తక్కెళ్ళపల్లి రవీందర్ రావ్ , సత్యం నెలికంటి లేవనెత్తిన అంశాలకు మంత్రి అడ్లూరి వివరాలను వెల్లడించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల పరిస్థితి గురించి ప్రస్తావించారు.

2025–26 విద్యా సంవత్సరం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.8,591.62 కోట్లుగా ఉన్నాయని తెలిపారు . ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల కాకపోవడంతో ప్రైవేటు కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయడానికి వారి నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయన్న అంశాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు స‌భ్యులు. అటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు మంత్రి ల‌క్ష్మ‌ణ్ కుమార్. దీంతో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కళాశాలలపై చర్యలకు సంబంధించిన తదుపరి ప్రశ్న ఉత్పన్నం కాదని అన్నారు.

పండిట్లు, పీఈటీల పోస్టుల అప్‌గ్రేడేషన్ పై శ్రీ‌పాల్ రెడ్డి ప్ర‌స్తావించారు. ఆశ్రమ పాఠశాలల్లోని పండిట్లు, పీఈటీల పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేసే అంశంపై స్పందించారు మంత్రి. ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఈ ప్రతిపాదనపై సాధ్యమైనంత త్వరగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.విద్యార్థుల సంక్షేమం, విద్యా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారంతో పాటు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది అంశాలపైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ చర్యలు తీసుకుంటోందని మంత్రి అడ్లూరి తెలిపారు.

Related News