వరుస సెలవులు శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు
నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లా లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం దేవాలయానికి భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవులు రావడంతో ఆలయంలో కొలువు తీరిన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకునేందుకు బారులు తీరారు. వీరిని నియంత్రించడం ఒకానొక దశలో పోలీసులకు కష్టతరంగా మారింది. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఆలయ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భారీ రద్దీ కారణంగా భక్తులు దర్శనం కోసం సుమారు రెండు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.
ఆలయ ప్రాంగణం , పరిసర ప్రాంతాలు భక్తులతో నిండి పోయాయి. క్యూ లైన్లను క్రమబద్ధీకరించడానికి , భక్తుల రాకపోకలు సజావుగా సాగేలా చూడటానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆలయ అధికారులు అభిషేకం , కుంకుమార్చన పూజలను నిలిపి వేశారు. వరుస సెలవుల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా పొరుగు ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలి వస్తుండటంతో ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని ఈవో వెల్లడించారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తదితర ప్రాంతాల నుంచి మల్లన్న కోసం తండోప తండాలుగా తరలి వచ్చారు. స్వామిని దర్శనం చేసుకుంటే , అభిషేకం చేస్తే ఇబ్బందులు తొలగి పోతాయని భక్తుల నమ్మకం.