భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి : అనిత
అమరావతి : ఏపీ రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించారు. ఆదివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అల్పపీడన తీవ్రత, వర్షాల పరిస్థితులపై ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారాన్ని అందించాలని మంత్రి సూచించారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తుగా హెచ్చరించేందుకు మొబైల్ హెచ్చరిక సందేశాలను నిరంతరం పంపించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసే కంట్రోల్ రూమ్‌ను కొనసాగించాలని స్పష్టం చేశారు. మరోవైపు వినాయక చవితి వేడుకల నేపథ్యంలో వినాయక మండపాల నిర్వాహకులు వర్షాల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా విద్యుత్ వైర్లు, తాత్కాలిక షెడ్ల నిర్మాణం విషయంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.