newsseals.com

తిరుమలలో 27,932 మంది చిన్నారులకు చైల్డ్ ట్యాగ్‌లు

September 20, 2026 · VijayaBhaskar

తిరుమ‌ల : శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చిన్నారుల భద్రతకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చైల్డ్ ట్యాగింగ్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించింది. చిన్నారులు తల్లిదండ్రుల నుంచి విడి పోయిన సందర్భాల్లో వారిని త్వరగా గుర్తించి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించేలా చర్యలు చేపడుతోంది. సెప్టెంబర్ 15 నుండి చిన్నారులకు చైల్డ్ ట్యాగ్‌లు ఏర్పాటు చేశారు. దీంతో నాలుగు రోజుల్లో మొత్తం 37,932 మంది చిన్నారులకు చైల్డ్ ట్యాగింగ్ కట్టారు.

చైల్డ్ ట్యాగింగ్ ద్వారా ఇప్పటి వరకు తప్పిపోయిన ముగ్గురు బాలికలను గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. రద్దీ ప్రాంతాల్లో చిన్నారులు తల్లిదండ్రుల నుంచి విడి పోయినప్పుడు చైల్డ్ ట్యాగ్‌పై ఉన్న వివరాల ఆధారంగా వారిని త్వరితగతిన గుర్తించి కుటుంబ సభ్యులతో కలిపేందుకు ఇది ఎంతగానో దోహద పడుతోంది. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు చిన్నారులను ఎల్లప్పుడూ తమ వెంట ఉంచుకోవడంతో పాటు, చైల్డ్ ట్యాగ్‌ను భద్రంగా ఉంచాలని పోలీసులు సూచించారు. చిన్నారులు తప్పిపోయిన సందర్భంలో వెంటనే సమీపంలోని పోలీసు సిబ్బందిని లేదా భద్రతా సిబ్బందిని సంప్రదించాలని తిరుపతి జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.

Related News