మెగా డీఎస్సీ అంటే పారదర్శకతకు చిరునామా
అమరావతి : మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ లేనిపోని అనుమానాలు సృష్టించడం తగదని అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రాధాన్య హామీల్లో మెగా డీఎస్సీ ఒకటని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో 148 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. నోటిఫికేషన్ నుంచి పరీక్షలు, ఆన్సర్ కీలు, మెరిట్ జాబితాలు, గ్రీవెన్సులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, తుది ఎంపిక వరకు నిర్దేశిత విధానాలను అనుసరించామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల ట్రాక్ రికార్డు ప్రజల ముందుంది. గతంలో అనేక డీఎస్సీలు, ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించాం. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా 14 సార్లు డీఎస్సీ ప్రక్రియలు చేపట్టిన అనుభవం ఉంది. నియామక ప్రక్రియల్లో పారదర్శకత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు అని మంత్రి పేర్కొన్నారు.
స్పోర్ట్స్ కోటాపై వైసీపీ ఉద్దేశ పూర్వకంగా అపోహలు సృష్టిస్తుందని మంత్రి ఆరోపించారు. క్రీడల్లో ప్రతిభ చూపి, గుర్తింపు పొందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కల్పించడం కొత్త విధానం కాదన్నారు. గత ప్రభుత్వాల కాలంలో సంబంధిత వ్యవస్థలే క్రీడాకారులకు సర్టిఫికెట్లు ఇచ్చాయి. ఇప్పుడు అదే సర్టిఫికెట్లతో నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన వారందరినీ ‘ఫేక్’ అని ముద్ర వేయడం ఎలా సమంజసం? ఏదైనా నిర్దిష్ట సర్టిఫికెట్‌పై అనుమానం ఉంటే దానిని పరిశీలించవచ్చు. తప్పు ఉంటే చర్య తీసుకోవచ్చు. కానీ మొత్తం స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల గౌరవాన్ని దెబ్బతీయడం సరికాదు అని అచ్చెన్నాయుడు అన్నారు. బ్రిడ్జ్ క్రీడను చూపిస్తూ జరుగుతున్న ప్రచారంపైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. బ్రిడ్జ్ అంశాన్ని ఆధారంగా చేసుకుని మొత్తం నియామక ప్రక్రియను అనుమానాస్పదంగా చిత్రీకరించడాన్ని ఆయన తప్పుబట్టారు.