న్యూఢిల్లీ : ప్రముఖ క్రాప్ న్యూట్రిషన్, ఫెర్టిజైజర్స్, అమ్మోనియా తయారీ సంస్థ యారా ఇంటర్నేషనల్ ఎఎస్ఎ పబ్లిక్ ఎఫైర్స్ , కమ్యూనికేషన్స్ హెడ్ వైశాలి చోప్రాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కాకినాడలో గ్రీన్-అమ్మోనియా మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్ పోర్ట్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ అవసరాలను తీర్చడానికి, అక్కడ ఒక ప్రత్యేక ఎరువుల మిశ్రమం, సూక్ష్మపోషకాల ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు. ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం సహకారంతో పంట-పోషణ సాంకేతికత, డిజిటల్ వ్యవసాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
వైశాలి చోప్రా స్పందిస్తూ యారా ఇండియా (గురుగ్రామ్) పంట పోషణ, వ్యవసాయ శాస్త్రం, డిజిటల్ వ్యవసాయ రంగాల్లో సేవలందిస్తోందన్నారు. 17 రాష్ట్రాలలో 1,500 అవుట్‌లెట్‌ల ద్వారా 5.5 మిలియన్ల మంది రైతులకు డిజిటల్‌గా చేరువైందని తెలిపారు. యుపిలోని బాబ్రాలా కాంప్లెక్స్ ద్వారా 1.6 మిలియన్ టన్నుల యూరియా, 0.66 మిలియన్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. బయో లాజికల్ క్రాప్ సొల్యూషన్ కోసం కైరాన్ బయోప్రైమ్‌తో భాగస్వామ్యం వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చిస్తామని తెలిపారు.






