హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించి మెటా ఇండియా సౌత్ సెంట్రల్ డేటా సెంటర్ రీజియన్‌ను ప్రారంభించారు మంత్రి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌కు ఇది ఒక చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. రెండు దశాబ్దాలకు పైగా హైదరాబాద్ సాంకేతిక ప్రయాణంలో మైక్రోసాఫ్ట్ ఒక భాగస్వామిగా ఉందని ప్రశంసలు కురిపించారు. ఈ కొత్త క్లౌడ్ రీజియన్‌తో, క్లౌడ్ , ఏఐ (AI) రంగాలలో హైదరాబాద్ ఒక వ్యూహాత్మక కేంద్రంగా ఆవిర్భవిస్తున్న తరుణంలో, భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కూడా ఇది సహాయ పడుతోందని పేర్కొన్నారు శ్రీధర్ బాబు.
ఇప్పటికే 300MW డేటా సెంటర్ సామర్థ్యం పనిచేస్తుండగా, 2GW అభివృద్ధి దశలో ఉందనన్నారు . దీనితో పాటు, విస్తృతమైన ఏఐ , డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్‌లో సుమారు $30 బిలియన్ల పెట్టుబడి పెట్టే అవకాశంతో, తెలంగాణ ఇప్పుడు 2029 నాటికి 5 GW సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు.తదుపరి దశ కేవలం సామర్థ్యాన్ని పెంచడం కంటే ఎక్కువ. ఏఐ కంపెనీలు, స్టార్టప్‌లు, పరిశోధకులు , గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌లు హైదరాబాద్ నుండే తమ కార్యకలాపాలను నిర్మించుకుని, విస్తరించగల ఒక ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి తాము మౌలిక సదుపాయాలు, ప్రతిభ , ఆవిష్కరణలను ఒకచోట చేర్చుతున్నామన్నారు శ్రీధర్ బాబు.
హైదరాబాద్ తదుపరి అధ్యాయాన్ని మేము ఈ విధంగానే ఊహించు కుంటున్నామని పేర్కొన్నారు. కేవలం ఒక టెక్నాలజీ హబ్‌గా మాత్రమే కాకుండా, రాబోయే దశాబ్దపు టెక్నాలజీలు నిర్మించబడే ప్రదేశంగా దీనిని భావిస్తున్నామని తెలిపారు.







