తిరువనంతపురం : అక్రమాలకు పాల్పడిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్. తక్షణమే సర్ ప్రక్రియను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు భారత ప్రజలది. బీజేపీ, సంఘ్ పరివార్ రాజకీయ ప్రయోజనాల కోసం దానిని తారుమారు చేయలేరని అన్నారు. శుక్రవారం తిరువనంతపురం లో మీడియాతో మాట్లాడారు. ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, ఎస్ఐఆర్ కు సంబంధించిన నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు లేవనెత్తినట్లు వచ్చిన వార్తలు భారత ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయని అన్నారు. అన్యాయంగా మినహాయించబడిన వారి ఓటు హక్కులను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం స్వాతంత్రం, విశ్వసనీయతను కాపాడాలని కోరారు.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన ఒక పరిశోధనాత్మక నివేదిక కారణంగా ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై రాజకీయ వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో విజయన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ నివేదిక ప్రకారం, ప్రస్తుత ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు , వివేక్ జోషి గత 10 నెలలుగా విధానాలు, డేటాబేస్ మార్పులు, ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు సంబంధించి కనీసం 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు నమోదు చేశారు. అయితే ఈ అభ్యంతరాలు ఎన్నికల సంఘంలో చీలికను లేదా సంస్థాగత విభేదాలను సూచిస్తున్నాయన్న వాదనను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. భిన్నమైన అభిప్రాయాలు, పరిశీలనలు , అంతర్గత తనిఖీలు అనేవి బహుళ-సభ్యుల రాజ్యాంగ సంస్థ సాధారణ పనితీరులో భాగమేనని, ఎస్ఐఆర్‌కు సంబంధించిన వాటితో సహా తుది నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నామని స్పష్టం చేసింది.





