తిరుపతి : తిరుపతి లోని పవిత్ర పుణ్య క్షేత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజైన శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర నామార్చన, నిత్యార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పవిత్ర సమర్పణ చేపట్టారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తి, ఉత్సవ మూర్తులు, ఉప ఆలయాలు, పరివార దేవతలు, విమాన ప్రాకారం, ధ్వజ స్తంభానికి పవిత్రాలను సమర్పించారు.
సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు ఘనంగా .ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆలయ డెప్యూటీ ఈవో హరింద్రనాథ్, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో శ్రీహరిరావు, సూపరింటెండెంట్లు సురేష్, రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు చలపతి, లక్ష్మీకాంతం, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో విస్తృతంగా పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.







