రూ.430 కోట్లతో కేంద్ర ప్రభుత్వ సహకార ప్రాజెక్టులు
అమరావతి : కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రానికి 8 పర్యాటక ప్రాజెక్టులకు రూ.428 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. వాటిలో స్వదేశీ దర్శన్ 2.0 క్రింద సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ. 97.52 కోట్లు,బొర్రా గుహలకు రూ. 29.87 కోట్లు,సాస్కి క్రింద అఖండ గోదావరి పునరుద్ధరణకు రూ. 94.44 కోట్లు, గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్లు, ప్రసాద్ స్కీమ్ కింద అన్నవరం దేవస్థానానికి రూ. 25.32 కోట్లు, సింహాచలంకు రూ. 54.04 కోట్లు, అదే విధంగా సీబీడీడీ క్రింద అహోబిలం స్పిరిచువల్ ఒడిస్సీకి రూ. 24.96 కోట్లు, నాగార్జున సాగర్ బౌద్ధ సర్క్యూట్‌కు రూ. 25 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు.
యుద్ధప్రాతిపదికన పర్యాటక అభివృద్ధి చేస్తున్నామన్నారు. బొర్రా గుహల్లో లైట్ అండ్ సౌండ్ షోలు, పర్యాటక ప్రాంతాల్లో 3, 5, 7 స్టార్ హోటళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.ఇవే గాక ప్రసాద్ స్కీం క్రింద అరసవిల్లి దేవాలయాన్ని కేంద్ర సహకారంతో మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు ప్రారంభించామన్నారు. తిరుపతి, విశాఖపట్నంను అంతర్జాతీయ స్థాయి ప్రధాన పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దడానికి కేంద్రం అంగీకరించిందని స్పష్టం చేశారు.కేరళ కోవాళం బీచ్ తరహాలో ఏపీలోని సుదీర్ఘ సముద్ర తీరంలో వెల్ నెస్ సెంటర్ల (ఆయుర్వేదం, యోగా) ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.