newsseals.com

ఆరోగ్యంపై చైతన్యం పెరగాలి : సీతక్క

September 28, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : సంపాదించ‌డం కంటే ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి సారించాల‌ని అన్నారు మంత్రి సీత‌క్క‌. హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన పింక్ ర‌న్ ను ఉద్దేశించి ఆమె ప్ర‌సంగించారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగ పడతాయని అన్నారు. హైదరాబాద్‌ మొత్తం ఈ కార్యక్రమానికి ఏకమైందని పేర్కొన్నారు. సుధా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పింక్‌ పవర్‌ రన్‌లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయం అన్నారు. సమాజంలో ఆరోగ్యంపై చైతన్యం పెంచేందుకు ఈ కార్యక్రమం దోహద పడుతుందని తెలిపారు. ఎంఈఐఎల్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జీవనశైలి వ్యాధులను నివారించేందుకు రోజువారీ వ్యాయామం ఎంతో అవసరమన్నారు. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి నిజమైన సంపద అని పేర్కొన్నారు.

సుధా రెడ్డి ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సుధా రెడ్డి మాట్లాడుతూ పింక్‌ పవర్‌ రన్‌ మూడో ఏడాదికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో పెరిగిన తమకు నగరానికి అత్యుత్తమ కార్యక్రమాలను అందించాలన్నదే లక్ష్యమని తెలిపారు. పింక్‌ పవర్‌ రన్‌కు తరలి వచ్చిన భారీ జనసందోహం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని.. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగిందని చెప్పారు. గణేశ్‌ నిమజ్జన సందడితోపాటు నగరంలో పింక్‌ పవర్‌ రన్‌ ఉత్సాహం కనిపించిందన్నారు. ఫిట్‌నెస్‌, ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. ఇక్కడి నుంచి తీసుకెళ్లే ఆరోగ్య స్ఫూర్తిని కుటుంబం, స్నేహితులు, సమాజంలోకి తీసుకెళ్లాలని కోరారు. పింక్‌ పవర్‌ రన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒక సెలబ్రిటీనే అని అభివర్ణించారు.

Related News