newsseals.com

గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం భద్రతా అవగాహన కార్యక్రమం

September 30, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం భద్రతపై పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు తెలంగాణ గిగ్ , ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ఫౌండ‌ర్ ప్రెసిడెంట్ స‌లావుద్దీన్. అత్యవసర సహాయం పొందడానికి, ఉల్లంఘనలను నివేదించడానికి , పోలీసు సంబంధిత భద్రతా సేవలను పొందడానికి హైదరాబాద్ పోలీస్ హాక్ ఐ మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించు కోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికులను ప్రోత్సహిస్తూ తెలంగాణ గిగ్ , ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ భద్రతా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన‌ట్లు తెలిపారు.

ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో పనిచేస్తూ వినియోగదారుల వద్ద సేవలు అందిస్తున్న గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికులందరూ అందుబాటులో ఉన్న డిజిటల్ భద్రతా సాధనాలను ఉపయోగించు కోవాలని టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ కోరారు. ప్ర‌ధానంగా ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్లు, డెలివ‌రీ కార్మికులు, పట్ట‌ణ కంపెనీ, గృహ ఆధారిత సేవా కార్మికులు, మ‌హిళా గిగ్ , ప్లాట్ ఫామ్ కార్మికులు ఉప‌యోగించు కోవాల‌ని సూచించారు.

ఎస్ఓఎస్ అత్యవసర హెచ్చరిక , లొకేషన్ షేరింగ్, నేరాలు , ఉల్లంఘనలను నివేదించడం, మహిళల భద్రతా సహాయం, పోలీసు అధికారుల సంప్రదింపు వివరాలు, అద్దెదారు /ఉద్యోగి నమోదు, పోలీసులకు ఫీడ్‌బ్యాక్ , సూచనలపై ఇందులో పొందు ప‌ర్చ‌డం జ‌రిగింద‌న్నారు స‌లావుద్దీన్. ఎస్ఓఎస్ సదుపాయం అత్యవసర పరిస్థితుల్లో స్నేహితులు లేదా బంధువులను అప్రమత్తం చేయడానికి, వినియోగదారు వివరాలు, లొకేషన్‌ను సంబంధిత పోలీసు అధికారులతో పంచుకోవడానికి సహాయప డుతుంద‌ని తెలిపారు.

గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ కార్మికులు సేవలు అందిస్తున్నప్పుడు రోడ్లపై ఎక్కువ గంటలు గడుపుతారని పేర్కొన్నారు. తరచుగా అపరిచిత ప్రదేశాలలోకి ప్రవేశిస్తారని, ఈ క్ర‌మంలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి కార్మికుడు అప్రమత్తంగా ఉండాలని, హాక్ ఐ యాప్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ఎస్ఓఎస్ సదుపాయాన్ని ఉపయోగించాలని కోరారు. గిగ్ కార్మికులకు సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్మించడంలో సహాయపడటానికి, గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికులందరూ హాక్ ఐ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, నేర్చుకొని, బాధ్యతాయుతంగా ఉపయోగించాలని పిలుపునిచ‌చ్చారు షేక్ స‌లావుద్దీన్.

Related News