న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం నిర్వాకంపై రోజు రోజుకు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీఈసీ చట్టంపై వెలువడిన తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. న్యాయమూర్తి కుమారుడికి ఎన్నికల సంఘంతో ఉన్న సంబంధాల గురించి ఈ పిటిషన్ లో ప్రస్తావించడం చర్చకు దారితీసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ , ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా షరతులు , పదవీకాలం) చట్టం, 2023 చెల్లుబాటుపై సెప్టెంబర్ 23న వెలువడిన భిన్నాభిప్రాయాలతో కూడిన తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ‘క్యూరేటివ్ పిటిషన్’ దాఖలైంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ , ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్యానెల్ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించే 2023 చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పెద్ద రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా వద్దా అనే అంశంపై 23న అత్యున్నత న్యాయస్థానం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది.
ఆ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కుమారుడు మధ్యప్రదేశ్ హైకోర్టులో ఎన్నికల సంఘం తరపున ‘స్టాండింగ్ కౌన్సెల్’ (న్యాయవాది)గా వ్యవహరిస్తున్నారని మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో జయ ఠాకూర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది వరుణ్ ఠాకూర్ ద్వారా దాఖలైన ఈ పిటిషన్‌లో పక్షపాతం, ఔచిత్యానికి సంబంధించిన సహేతుకమైన సందేహాలు లేవనెత్తారు. తీర్పు వెలువడిన తర్వాతే జస్టిస్ శర్మ కుమారుడు ఎన్నికల సంఘం న్యాయ బృందంలో ఉన్న విషయం పిటిషనర్‌కు తెలిసిందని అందులో పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం తరపున సిద్ధార్థ్ శర్మ నిర్వర్తించే వృత్తిపరమైన విధులకు , ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసును జస్టిస్ సతీష్ చంద్ర శర్మ విచారించి తీర్పు ఇవ్వనున్నారు. న్యాయమూర్తి కుటుంబ సభ్యుడు ఒక పక్షానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసును, అది వేరే వేదికలో అయినా సరే, న్యాయమూర్తి విచారించలేరని, విచారణ ప్రారంభానికి ముందే జస్టిస్ శర్మ తన కుమారుడి గురించి వెల్లడించి ఉండాల్సిందని అది పేర్కొంది.





