ధరల నియంత్రణలో విజయ్ విఫలం : ఎంకే స్టాలిన్
తిరుప్పూర్ జిల్లా : రాష్ట్రంలో ధరల నియంత్రణను నియంత్రించడంలో టీవీకే సర్కార్ వైఫల్యం చెందిందని ఆరోపించారు మాజీ సీఎం ఎంకే స్టాలిన్. ‘ఎమ్మెల్యేల కొనుగోలు’లో నిమగ్నమైన ఆయనకు ప్రజల కష్టాలు తెలుసా అని ప్రశ్నించారు. గత నాలుగు నెలల్లో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడం వల్ల సామాన్య కుటుంబాలు తమ రోజువారీ ఖర్చులను భరించలేక ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుప్పూర్ జిల్లాలోని ధరాపురంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం విజయ్ పై నిప్పులు చెరిగారు. ధరల పెరుగుదల ప్రభావాన్ని తెలుసు కోవడానికి ఆయన ఒక కిరాణా దుకాణం వద్ద వ్యాపారులు , స్థానికులతో మాట్లాడారు.
చిన్న చిన్న వీడియో క్లిప్‌లు (రీల్స్) చూడటం వల్ల బాధపడుతున్న కుటుంబాల ఆకలి తీరుతుందా?” అని డీఎంకే అధినేత మండిపడ్డారు. గతంలో జాతీయ ఆర్థిక మందగమన సమయంలోనూ ‘ద్రావిడ నమూనా’ పాలనతో రాష్ట్రం స్థిరమైన వృద్ధిని సాధించిందని, కానీ ఇప్పుడు కీలక సూచికలు క్షీణించడం ప్రారంభించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు గత ఆర్థిక పనితీరుకు, ప్రస్తుత పరిస్థితికి మధ్య భారీ వ్యత్యాసం ఉందని స్టాలిన్ ఆరోపించారు. జాతీయ స్థాయిలో జీఎస్టీ (GST) ఆదాయం పెరిగినప్పటికీ, గత మూడు నెలల్లో తమిళనాడు ఆదాయంలో మాత్రం తగ్గుదల కనిపించిందని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.