హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాల మరణాలలో తెలంగాణ దేశంలోనే 7వ స్థానంలో ఉందన్నారు డీజీపీ సీవీ ఆనంద్. వీటి నివారణపై ఫోకస్ పెడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించే లక్ష్యంతో తెలంగాణలోని ఏడు జిల్లాల్లో ప్రత్యేక జిల్లా రోడ్డు భద్రతా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. సేఫ్లైఫ్ ఫౌండేషన్ రూపొందించిన ఈ ప్రణాళికల్లో 2024, 2025 eDAR గణాంకాల ఆధారంగా ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించారు. మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో 48 కీలక ప్రమాద కారిడార్లు, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ మరణాలు నమోదైన 230 ప్రాధాన్య-1 ప్రాంతాలు, 220 ట్రాఫిక్ ఉల్లంఘన ప్రాంతాలు, 183 కీలక పాదచారుల ప్రమాద ప్రాంతాలను గుర్తించారు.
ఇందులో సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 14 కీలక కారిడార్లు, రంగారెడ్డిలో 98 ప్రాధాన్య ప్రమాద ప్రాంతాలు, 99 ట్రాఫిక్ ఉల్లంఘన ప్రాంతాలు, 66 పాదచారుల ప్రమాద ప్రాంతాలు ఉన్నట్లు కార్యాచరణ ప్రణాళిక వెల్లడించింది. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలు, సమయాలు, రహదారి నిర్మాణం, ఇంజినీరింగ్ లోపాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ‘4ఈ’ విధానాన్ని అమలు చేయనున్నట్లు డీజీపీ తెలిపారు. ఇందులో ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ సపోర్ట్ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.






