newsseals.com

ద‌స‌రా ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన హోం మంత్రి

October 12, 2026 · VijayaBhaskar

విజ‌య‌వాడ : బెజ‌వాడ లోని ఇంద్ర‌కీలాద్రి శ్రీ ద‌స‌రా ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను సోమ‌వారం ప‌రిశీలించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. మోడల్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0, జాతీయ సరస్ మేళా సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేప‌ట్టారు. భక్తుల భద్రతకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో 30 అధునాతన డ్యాష్‌బోర్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామ‌న్నారు. భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు ఏఐ కెమెరాలు, డ్రోన్లు, ఏఎన్‌పీఆర్ సాంకేతికత వినియోగిస్తున్న‌ట్లు చెప్పారు వంగ‌ల‌పూడి అనిత‌.

క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాలు, ఆర్టీసీ, రైల్వే ప్రయాణికుల రద్దీపై ప్రత్యేక నిఘా పెట్టాల‌ని ఈ సంద‌ర్బంగా ఆదేశించారు హోం శాఖ మంత్రి. భక్తుల సౌకర్యార్థం నగరంలో 40 పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా చేస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టికే ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరును హోంమంత్రికి వివరించారు డీసీపీలు షిరిన్ బేగం, కేజీవీ సరిత, కృష్ణ ప్రసన్న తదితర పోలీస్ అధికారులు. ఇదిలా ఉండ‌గా అక్టోబ‌ర్ 14న బుధ‌వారం భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము రానున్నారు. దీంతో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు వంగ‌ల‌పూడి అనిత‌.

Related News