Tuesday, 13 October 2026

శ్రీకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి దివ్య దర్శనం

newsseals-ChinnaSeshaVahanam

తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం శ్రీ మలయప్ప స్వామి వారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితుడైన స్వామి వారిని దర్శించుకుని భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. ముందుగా గజాలు, అశ్వాలు నడుస్తుండగా, భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, వివిధ కళాబృందాల ప్రదర్శనల నడుమ వాహనసేవ కన్నుల పండువగా సాగింది. గోవింద నామ స్మరణలతో తిరుమల మాడ వీధులు మార్మోగాయి.

వైష్ణవ సంప్రదాయంలో భగవంతుడిని ‘శేషి’గా, ప్రపంచాన్ని ‘శేషభూతం’గా భావిస్తారు. నాగరాజైన వాసుకిని ప్రతిబింబించే చిన్నశేష వాహనం ఈ శేషి భావాన్ని చాటి చెబుతుంది. చిన్నశేష వాహనంపై స్వామివారిని దర్శించు కోవడం వల్ల కుటుంబ శ్రేయస్సు కలుగుతుందని, కుండలినీ యోగసిద్ధి ఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. మంగళవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, పాలకమండలి సభ్యులు, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *