newsseals.com

పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు

October 13, 2026 · VijayaBhaskar

తిరుమ‌ల : శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీ గోవిందరాజ స్వామి అలంకారంలో ఏడు తలల స్వర్ణ శేష వాహనంపై (పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామి వారిని సేవిస్తూ పాన్పుగా దాస్య భక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బల రాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు.

మంగళవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి, టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆధ్వ‌ర్యంలో. అంతేకాకుండా తిరుమ‌ల‌, తిరుప‌తి ఘాట్ రోడ్ల వ‌ద్ద సెక్యూరిటీ త‌నిఖీ ముమ్మ‌రం చేశారు.

Related News