తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెక్యూరిటీ డిటాచ్‌మెంట్ సిబ్బంది తిరుమల అప్‌ఘాట్, డౌన్‌ఘాట్ రోడ్లతో పాటు తిరుమల పరిసర ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగిస్తూ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబ్ డిటెక్షన్ (BD) బృందాలు, డాగ్ స్క్వాడ్‌ల సహకారంతో అనుమానాస్పద వస్తువులు, వాహనాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనాలు, తిరుమలకు చేరుకునే మార్గాలు, కీలక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నారు. పోలీసు సిబ్బంది సమన్వయంతో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ భద్రతా విధులు నిర్వహిస్తున్నారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు ప్రశాంతంగా స్వామి వారిని దర్శించుకునేలా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ భద్రతా చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎస్పీ సుబ్బారాయుడు. తిరుమలలో లేదా ఘాట్ రోడ్లలో ప్రయాణించే సమయంలో ఏవైనా అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల కదలికలు లేదా అత్యవసర పరిస్థితులు గమనించినట్లయితే వెంటనే డయల్ 112 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. భక్తుల భద్రత కోసం పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని విజ్ఞప్తి చేశారు.




