అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు మంత్రి ఎస్. సవిత. డీఎస్సీ నోఫికేషన్ రాగానే ఉచిత శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఆఫ్ లైన్, ఆన్ లైన్ ద్వారా ఈ శిక్షణ అందజేయనున్నామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు కూడా ఉచిత శిక్షణ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. పీ4 ఫౌండేషన్ వైఎస్ చైర్మన్ కుటుంబరావు మాట్లాడుతూ ఉచిత సివిల్స్ కోచింగ్ మెయిన్స్ కు ఎంపికైన బీసీ అభ్యర్థులకు రూ.రెండు లక్షల చొప్పున వ్యక్తిగతంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పీ4 విధానంలో బీసీలను అన్ని రంగాల్లోనూ ముందు ఉంచాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.
పార్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు భాగవతుల రవికుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆశయ సాధనలో భాగంగా బీసీ విద్యార్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్ అందజేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ చీఫ్ మెంటార్ లక్ష్మయ్య మాట్లాడుతూ బీసీ విద్యార్థులకు సివిల్స్ కు మెరుగైన శిక్షణ అందజేస్తామన్నారు. ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా కలిసి, వారికి శిక్షణ అందజేస్తామన్నారు. ఏపీ గెజిటెడ్ జేఏసీ చైర్మన్ కేవీ కృష్ణయ్య మాట్లాడుతూ తమ ఉద్యోగ సంఘ తరఫున పలువురు విద్యార్థులకు పీ4 విధానంలో సివిల్స్ కోచింగ్ అందజేస్తామని తెలిపారు. అంతకు ముందు మంత్రి సవిత సమక్షంలో ఒప్పంద పత్రాలపై బీసీ సంక్షేమ శాఖ అధికారులు, డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ ప్రతినిదులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.




