తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక బతుకమ్మ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి బతుకమ్మ ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతికి, ప్రకృతికి ప్రతీకగా నిలిచే ఈ అందమైన పూల పండుగలో వివిధ హోదాల్లో ఉన్న మహిళా సిబ్బంది అంతా కలిసి చప్పట్లు కొడుతూ, సాంప్రదాయ బతుకమ్మ పాటలను ఆలపించి వేడుకల శోభను మరింత పెంచారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బోనాలు, బతుకమ్మ పండుగలకు మరింత గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు.
నల్గొండ జిల్లాలోని తన అమ్మమ్మ ఊరైన దోతుగూడెంలో ప్రతి ఏటా దసరా సెలవుల సమయంలో జరుపుకున్న బతుకమ్మ పండుగ జ్ఞాపకాలను డీజీపీ సీవీ ఆనంద్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తన తల్లి, బంధువులతో కలిసి గ్రామ చెరువు వద్దకు వెళ్లి వేడుకల్లో పాల్గొనే వారని, ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ ఎంతో ప్రత్యేకమైనవని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ విభాగంలోని మహిళా సిబ్బందికి , తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బోనాలు, బతుకమ్మ పండుగలకు మరింత విస్తృత గుర్తింపు లభించిందని అన్నారు డీజీపీ.