Thursday, 15 October 2026

కళాకారులను సన్మానించిన టీటీడీ ఈవో

newsseals-EOTTD

తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన కల్పవృక్ష వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో భక్తులను మంత్ర ముగ్ధులను చేశారు. దేశంలోని విభిన్న ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు శ్రీవారి వాహనసేవకు విశేష శోభను చేకూర్చాయి. పది రాష్ట్రాలకు చెందిన 16 కళా బృందాల్లోని 412 మంది కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద నృత్యాలు భక్తుల్లో భక్తి భావాన్ని నింపాయి. కేరళకు చెందిన గోపికానృత్యం, తిరువాతిరకళి, అష్టపదమేళం, ఒయ్యాలాటం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూచిపూడి, భాగవతం, జానపద నృత్యాలు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రైబెన్స్యా జానపద నృత్యం, హిమాచల్ ప్రదేశ్ లంబాడా నృత్యం , మణిపూర్ సంప్రదాయ నృత్యాలు, ఒడిశా ఒడిస్సీ నృత్యం; తెలంగాణ కాళింగ నృత్యం, తిల్లానా, పద్మావతీ పరిణయం, అస్సాం సత్రియ, బిహు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సంప్రదాయ వేషధారణలు, లయబద్ధమైన నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుని భారతీయ కళా సంపదలోని వైవిధ్యాన్ని చాటి చెప్పాయి. కల్పవృక్ష వాహనసేవలో ప్రతిభావంతమైన ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర సన్మానించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డా. ఎస్. ఉషారాణి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం, అస్సాంకు చెందిన దీప్సిక భూయన్ బృందం ప్రదర్శించిన సత్రియ నృత్యం, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మౌమితా పాల్ బృందం ప్రదర్శించిన రైబెన్స్యా జానపద నృత్యం, కేరళకు చెందిన కె.ఆర్. దేవదాస్ బృందం ప్రదర్శించిన గోపికా నృత్యం చేసిన కళాకారులను టిటిడి ఈవో సన్మానించారు. శ్రీవారి వాహన సేవలో భక్తి, కళ, సంస్కృతుల సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శనలు తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత శోభాయమానం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *