తిరుమల ; శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుమలలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా తిరుమలలోని నాద నీరాజనం వేదికపై ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఉదయం 4:30 నుండి 5:30 గంటల వరకు రవిప్రభ, నాగేశ్వరరావు బృందం నాదస్వరం, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేద వేద విద్యాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేద సందేశం అందించారు. సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు బీజాపూర్కు చెందిన మాళవిక జోషి నామ సంకీర్తన నిర్వహించారు.
ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీవాణి బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు బెంగుళూరుకు చెందిన సంగూత కఖండకి బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హైదరాబాద్కు చెందిన శ్రీమాన్ వంశీకృష్ణ ధార్మికో ఉపన్యాసం ఇచ్చారు. సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన బుల్లెమ్మ బృందం అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా గానం చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుపతికి చెందిన మాధవి బృందం హరికథ గానం జరిగింది.




