తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు రాత్రి నిర్వహించిన సర్వభూపాల వాహనసేవ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ కళా రూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏడు రాష్ట్రాలకు చెందిన 16 కళా బృందాల్లోని 437 మంది కళాకారులు తమ గాన, వాద్య, నృత్య ప్రదర్శనలతో తిరుమాడ వీధుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ఆవిష్కరించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన గసియారి నృత్యం, కర్ణాటక సంప్రదాయ వీరనృత్యం పట్టకునిత, తెలంగాణ రాజ్‌గోండ్ తెగకు చెందిన గుస్సాడి నృత్యం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖజరి జానపద నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో ప్రదర్శించిన కృష్ణలీలలు, బృందావన ఘట్టాలు భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.
రాజస్థానీ కళాకారులు రంగురంగుల సంప్రదాయ వస్త్రధారణతో జానపద గీతాలను ప్రదర్శించి ఆ రాష్ట్ర ఎడారి సంస్కృతిని ప్రతిబింబించారు. మహారాష్ట్రతో పాటు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహిళా కళాకారులు ప్రదర్శించిన డప్పు విన్యాసాలు భక్తుల్లో ఉత్సాహాన్ని నింపాయి. శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు భరతనాట్యం, కూచిపూడి నృత్య రూపకాల ద్వారా సర్వ భూపాల వాహనసేవ వైభవాన్ని భక్తిభావంతో ప్రదర్శించారు. దేశంలోని వివిధ ప్రాంతాల జానపద, సంప్రదాయ, శాస్త్రీయ కళారూపాలు ఒకే వేదికపై ప్రదర్శించడంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మరింత సాంస్కృతిక శోభ చేకూరింది. భక్తి, కళ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శనలు భక్తులకు కనువిందు చేశాయి.




