Monday, 19 October 2026

టైగర్ ష్రాఫ్‌పై కేసులో నిందితులు అరెస్ట్

newsseals-TigerShaaraff

ముంబై : ముంబైలోని జుహు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పుష్పా పార్క్ సమీపంలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో ఫోరెన్సిక్ అధికారులు విచారణ చేపట్టారు. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను కోటా పోలీసులు అరెస్టు చేసినట్లు కోటా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తేజస్విని గౌతమ్ తెలిపారు. కోటా సిటీ పోలీస్ బృందం రైలులో ప్రయాణిస్తున్న ఈ ముగ్గురు నిందితులను పట్టుకుంది. వీరిలో ఇద్దరు హర్యానాకు చెందినవారు కాగా, మూడవ వ్యక్తి బీహార్‌కు చెందినవాడని పోలీసులు వెల్లడించారు. ముంబై పోలీసుల సమాచారం ప్రకారం, ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో టైగర్ ష్రాఫ్ ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఒక ఫుట్‌బాల్ క్లబ్ నుండి బయటకు వస్తున్నప్పుడు ఈ కాల్పులు జరిగాయి.

నిందితులు నటుడి కారుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్‌కు నేరుగా బుల్లెట్ గాయాలు ఏవీ తగలలేదు, కానీ ఆయన డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన తర్వాత ఆదివారం రాత్రి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే టైగర్ ష్రాఫ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. గన్‌పౌడర్ , గాజు ముక్కల వల్ల నటుడి ఎడమ చేతికి గాయాలయ్యాయని ఆయన తెలిపారు. ఈ ఘటనతో టైగర్ ష్రాఫ్ , ఆయన తల్లి అయేషా ష్రాఫ్ తీవ్ర భయాందోళనకు గురయ్యారని పేర్కొన్న షిండే, వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన షిండే, “కఠిన చర్యలు తీసుకుంటాం, ప్రముఖ వ్యక్తులపై బెదిరింపులను ఏమాత్రం సహించబోం” అని స్పష్టం చేశారు. ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ దాడిని శిక్షణ పొందిన షూటర్లు చేశారు. వారు దాడికి ముందు నటుడి కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా (రెక్కీ) నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *