ఉత్తర ప్రదేశ్ : ప్రవాస భారతీయురాలైన సబా హైదర్ చరిత్ర సృష్టించారు. తాజాగా అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సత్తా చాటారు. అద్భుత విజయాన్ని నమోదు చేశారు. బులంద్‌షహర్‌కు చెందిన ఏఎమ్‌యు పూర్వ విద్యార్థిని తను. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన కుటుంబ నేపథ్యం కలిగిన సబా హైదర్ ఇల్లినాయిస్ హౌస్ డిస్ట్రిక్ట్ 84 స్థానంలో విజయం సాధించారు. తద్వారా ఆ రాష్ట్ర జనరల్ అసెంబ్లీకి ఎన్నికైన తొలి దక్షిణాసియా మహిళగా నిలిచారు. నవంబర్ 3న జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి బ్రయాన్ స్కోపాపై ఆమె విజయం సాధించారు. సబా హైదర్ 20,756 ఓట్లను (70.9 శాతం) సాధించగా బ్రయాన్ స్కోపా 8,520 ఓట్లను (29.1 శాతం) పొందారు. ఈ నియోజకవర్గం విల్, డుపేజ్, కేన్ , కెండల్ కౌంటీలలోని కొన్ని ప్రాంతాలను కలిగి ఉంది ఇందులో అరోరా, నేపర్‌విల్లే, ఓస్వెగో, మాంట్‌గోమెరీ , బౌల్డర్ హిల్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సబా హైదర్ కుటుంబం, బులంద్‌షహర్ జిల్లాలోని ఔరంగాబాద్ పట్టణానికి చెందినది. ఆమె తన బాల్యాన్ని ఘజియాబాద్‌లో గడిపారు. ఆమె తండ్రి సయ్యద్ అలీ హైదర్ ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్లారు. ఘజియాబాద్‌లోని హోలీ చైల్డ్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె, ఆ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించారు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుండి వైల్డ్‌లైఫ్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని గోల్డ్ మెడల్‌తో పూర్తి చేశారు. 2006లో ఆమె కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అలీ కాజ్మీని వివాహం చేసుకుని, అమెరికాకు వలస వెళ్లారు. వీరికి వివాహమై దాదాపు 20 ఏళ్లు అవుతుండగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సామాజిక సేవ నుండి శాసన విజయం వరకు ఇల్లినాయిస్ హౌస్ సీటును గెలుచుకోవడానికి ముందు హైదర్ డూపేజ్ కౌంటీ బోర్డులో పని చేశారు . అనేక పౌర, సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. ఆమె చేసిన పనిలో ప్రజారోగ్యం, విద్య, పర్యావరణ సమస్యలు , స్థానిక సంస్థలతో అనుసంధానం వంటివి ఉన్నాయి.




