newsseals.com

డిసెంబరు 13న భగవద్గీత కంఠస్థ పోటీలు : టీటీడీ

November 19, 2026 · VijayaBhaskar

తిరుప‌తి : టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబరు 13వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించనున్నారు. టీటీడీ విద్యాసంస్థలతో పాటు తిరుపతి జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. భగవద్గీతలోని 6వ అధ్యాయం ధ్యాన యోగంపై 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు, 18వ అధ్యాయం మోక్ష సన్యాసయోగం పై 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఆసక్తి గల విద్యార్థులు ఉదయం 9 గంటలకు అన్నమాచార్య కళా మందిరానికి హాజరు కావాలి. మరిన్ని వివరాలకు 9676615643, 8500049345 నంబర్లలో సంప్రదించవచ్చు.

అలాగే ఆయా పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలల్లో పోటీలు నిర్వహించి, ఒక్కొక్క విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థుల వివరాలను డిసెంబరు 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అన్నమాచార్య కళామందిరంలోని ప్రోగ్రాం అసిస్టెంట్‌కు లేదా హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యాలయంలో సంబంధిత విభాగానికి అంద జేయాలి. వివరాలను hdpp.prints@gmail.com కు కూడా పంపవచ్చు. ఈ పోటీల్లో విజేతలకు డిసెంబరు 20వ తేదీన గీతా జయంతి సందర్భంగా సాయంత్రం 5 గంటలకు అన్నమాచార్య కళామందిరంలో బహుమతులు ప్రదానం చేస్తారు.

Related News