హైదరాబాద్ : విద్య లేక పోవడమే అసలైన వెనకబాటుతనం అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓట్ల కోసం, రాజకీయం కోసం నేను పనులు చేయడం లేదన్నారు. ఫిన్‌లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొట్ట మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. సమాజంలో విద్య సమూల మార్పులు తీసుకు వచ్చేందుకు పునాదిగా పని చేస్తుందని నెహ్రూ నమ్మారు. దేశంలో కరువును పారద్రోలేందుకు ఇరిగేషన్ అవసరాన్ని గుర్తించారని, అందుకే సాగునీటి ప్రాజెక్టులను ఆయన ఆధునిక దేవాలయాలుగా వర్ణించారని పేర్కొన్నారు. ఆనాటి ప్రధాని నెహ్రూ దూరదృష్టితో ఈనాడు 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తెలంగాణ ఉత్పత్తి చేయగలిగిందని చెప్పారు సీఎం.
హరిత విప్లవం, పంచవర్ష ప్రణాళికలు తెచ్చిన నాయకులు ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటినుంచి 2104 వరకు ప్రధానులుగా ఉన్నవాళ్లు చేసిన మొత్తం అప్పు 50 లక్షల కోట్లు అని వెల్లడించారు. 2014 నుంచి 2026 వరకు ప్రధాని మోడీ చేసిన అప్పు 151 లక్షల కోట్లు అని తెలిపారు. ఇప్పటి వరకు దేశంపై ఉన్న అప్పు 201 లక్షల కోట్లు .కొందరు చిన్న చిన్న సంఘటనలు చూపి గొప్ప గొప్ప విజయాలుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఆనాడు ఎన్నో యుద్ధాలను ఎదుర్కొని భారత్ ను సార్వభౌమత్వ దేశంగా మార్చిన వారి గురించి మాత్రం తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు పీవీ తీసుకొచ్చిన గురుకులాలే నేటి నవోదయ విద్యాలయాలకు స్ఫూర్తి అని తెలిపారు.
ఆనాటి నాయకులు తెచ్చిన సంస్కరణలతో విద్య అందింది.. ఆకలి తీరిందన్నారు సీఎం. కానీ ప్రపంచంతో పోటీ పడాలంటే ఇది సరిపోదన్నారు. ప్రతీ పేదవాడికి విద్యను అందించడం మాత్రమే సరిపోదని, వారిని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలని అప్పుడే కల సాకారం అవుతుందన్నారు. నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందిచడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా తెలంగాణను తీర్చి దిద్దే ప్రతినిధులు మీరేనని అన్నారు. వెనకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులతో సంబంధం లేదన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం పేదలకు పంచడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష 8 వేలు ఖర్చు చేస్తోందని చెప్పారు.






