అమరావతి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌తో సమావేశమయ్యారు. వ్యాపార నిర్వహణ సౌలభ్యంకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆదాయ వనరుల గండిని పూడ్చడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను వినియోగిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ జీఎస్టీ వ్యవస్థను బలోపేతం చేయడం , రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సేకరణను పెంచడంలో A ఏఐ వినియోగంపై అరవింద్ సుబ్రమణియన్‌తో చర్చించారు. జీఎస్టీ వ్యవస్థలోని లోపాలను గుర్తించడం, పన్ను పరిపాలనను మెరుగు పరచడం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి పటిష్టమైన ప్రణాళికను రూపొందించడంలో ఏఐ ఆధారిత పరిష్కారాలను అవలంబించడంపై ఈ చర్చలు జరిగాయి. ఆదాయ సమీకరణను మెరుగు పరచడానికి జీఎస్టీ , ఎక్సైజ్ శాఖలలో అవసరమైన సంస్కరణలను కూడా రేవంత్ రెడ్డి సమీక్షించారు.
ప్రక్రియలను సరళీకృతం చేయడానికి, పన్ను పరిపాలనను బలోపేతం చేయడానికి జీఎస్టీ అధికారుల కోసం ప్రత్యేకమైన AI-ఆధారిత సమాచార వ్యవస్థను ప్రవేశ పెడతామని ఆయన చెప్పారు. అదే సమయంలో, ఈ కొత్త వ్యవస్థ వ్యాపారాలకు ఎలాంటి అసౌకర్యం లేదా అంతరాయం కలిగించ కూడదని నొక్కి చెప్పారు. సాంకేతికతను ఉపయోగించి ఆదాయ సేకరణను పెంచడంతో పాటు, రాష్ట్రంలో వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని కూడా మెరుగు పరచవచ్చని సుబ్రమణియన్ వివరించారు. ముఖ్యంగా భవన , నిర్మాణ సామగ్రి రంగంలో ఆదాయ గండిని అరికట్టడంపై కూడా చర్చలు జరిగాయి. మున్సిపల్ పరిపాలన, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, పంచాయతీ రాజ్, విద్యుత్, ఆర్థిక , వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఏఐ-ఆధారిత డేటా అనుసంధానం ద్వారా మెరుగైన సమన్వయాన్ని సాధించడంపై దృష్టి సారించాలని సూచించారు.
పెద్ద భవనాలు , కాంట్రాక్ట్ పనులకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే దశలోనే నిర్మాణ సామగ్రి అవసరాలు, దానికి సంబంధించిన పన్ను అంచనాల వివరాలను నమోదు చేయడం ద్వారా మెరుగైన పర్యవేక్షణ , నిబంధనల అమలు సాధ్యమవుతుందని సూచించారు. ప్రతిపాదిత ఏఐ ప్లాట్‌ఫారమ్ నుండి వచ్చే డేటాను మీసేవ , ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి డేటాబేస్‌లతో అనుసంధానించడం ద్వారా పరిపాలనను గణనీయంగా బలోపేతం చేయవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.







