
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్లనే తాను బతికి బయట పడ్డానని ఇవాళ సీఎంగా మీకు సేవలు అందిస్తున్నానని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. నాపై 24 క్లైమోర్ మైన్స్ పేల్చితే… సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామియే నాకు ప్రాణభిక్ష పెట్టాడని అన్నారు. ఆ స్వామి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఆనాడు ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లోనూ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రాణదానం ట్రస్ట్ కింద రూ. 688 కోట్ల నిధులను సమీకరించి తిరుపతిలో ఉండే ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు సీఎం .
రాష్ట్రంలో 17 లక్షల శ్రీవారి సేవకులు ఉన్నారని చెప్పారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయంటే అందులో సేవకుల కృషి కూడా ఉందన్నారు. విదేశాల్లో ఉంటున్న మన తెలుగు డాక్టర్లు ఓ వారం రోజులు తిరుపతిలో పేదలకు వైద్యం చేసి శ్రీవారి దర్శనం చేసుకోమని తాను పిలుపునిచ్చానని అన్నారు. దేశ వ్యాప్తంగా 5 వేల శ్రీవారి ఆలయాలను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మసీదులు, చర్చిలు కట్టుకోవడానికి ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన ముగిసిందన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉండే పరిస్థితులు లేవన్నారు. 2024లో ప్రజలకు స్వేచ్ఛ ,స్వాతంత్రం వచ్చిందన్నారు. కొన్ని పార్టీలకు మంచి పనులు చేయడం రాదంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు.