మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్
హైదరాబాద్ : పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికార దాహంతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బిఆర్ఎస్ దోపిడి భరించలేక ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ హవా పెద్ద ఎత్తున కనిపిస్తుందన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారని జోష్యం చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆదివారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్బంగా జరిగిన పార్టీ ప్రచారంలో అభ్యర్థి తరపున ఆయన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పదేళ్లు సీఎం గా పని చేసిన కెసిఆర్ మా అభ్యర్థి గురించి మాట్లాడాడు అంటే మా విజయం తేలి పోయిందని అర్థమై పోయిందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
నిజంగా నవీన్ యాదవ్ రౌడీ అయితే పోయిన ప్రభుత్వం లో ఎన్ని కేసులు ఉన్నాయో బీఆర్ఎస్ నేతలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్లు కావాలని తమ అభ్యర్థికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి. జూబ్లీహిల్స్ అంటే క్లాస్ పీపుల్ అని అందరూ అనుకుంటారు కానీ ఇది మాస్ ఏరియా అని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మాస్ ఏరియా వాళ్లకి అభివృద్ధి,సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ నే గుర్తుకు వస్తుందన్నారు. కంటోన్మెంట్స్ లో సెంటిమెంట్ వర్క్ అవుట్ అవలేదు ఇక్కడ కూడా కాదన్నారు. మాగంటి సునీతను ఎవరూ నమ్మడం లేదన్నారు. అంతే కాదు ప్రజలను మోసం చేసిన బిఆర్ఎస్ ను జూబ్లిహిల్స్ ప్రజలు ఛీ కొట్టడం ఖాయమన్నారు.






