టీటీడీ చేపట్టిన కార్యక్రమాల గురించి వెల్లడి
హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాద పూర్వకంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల తరపున తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం శ్రీ వెంకటేశ్వరుని దివ్య ఆశీస్సులు కోరుతూ సాంప్రదాయ శ్రీవారి శేష వస్త్రం సమర్పించారు. ఈ ప్రాంతమంతా భక్తులకు సేవ చేయడానికి టీటీడీ ఆధ్యాత్మిక కార్యకలాపాలు, రాబోయే కార్యక్రమాల గురించి గవర్నర్ కు చైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అత్యధికంగా భక్తులు కలిగి ఉన్నారని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
గవర్నర్ ను కలిసిన అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో టీటీడీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమర్థవంతమైన నాయకత్వం ప్రస్తుతం ఏపీలో కొలువు తీరి ఉందన్నారు. ప్రత్యేకించి ఆ శ్రీవారికి అపర భక్తులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారని చెప్పారు. సీఎం దిశా నిర్దేశం, సర్కార్ ప్రోత్సాహంతో విస్తృతంగా సేవలు అందించాలని నిర్ణయించామన్నారు బీఆర్ నాయుడు.







