కీలక ప్రకటన చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాలతో పాటు స్థానికంగా ఉన్న గుళ్లలో కూడా శ్రీవారి సేవకుల సేవలు విస్తరింప చేస్తామని అన్నారు. తిరుమలలో సూపర్ వైజర్లకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఈవో సందర్శించారు. ఈ సందర్బంగా వారితో నేరుగా సంభాశించారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో తరగతి శిక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అధ్యయనం చేసిన అంశాలను గ్రూప్ సూపర్వైజర్లు తమ ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులకు నేర్పించాలని సూచించారు. అంతే కాకుండా వారిని ఉత్తమ సేవకులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు అనిల్ కుమార్ సింఘాల్.
త్వరలో టీటీడీ పరిధిలోని స్థానిక ఆలయాలన్నింటిలో కూడా శ్రీవారి సేవను దశల వారీగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. శ్రీవారి సేవకులు తమ ప్రాంతాల్లోని ఆలయాల్లో కూడా శ్రీవారి సేవ చేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి. రవి, పీఆర్వో (ఎఫ్ఏసీ) నీలిమ, IIM అహ్మదాబాద్ , AP ప్రణాళిక విభాగం నిపుణులు, తదితరులు పాల్గొన్నారు.






