2014 నుంచి జరిగిన అక్రమాల బండారం బయట పెడతా
హైదరాబాద్ : నా టార్గెట్ సీఎం కావడం. ఇవాళ కాక పోవచ్చు. కానీ ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావడం పక్కా అని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తాను ఏనాడూ తప్పు చేయలేదన్నారు. ఒకవేళ తప్పు చేసినట్లయితే బహిరంగంగానే క్షమాపణలు చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. తాను ముందు నుంచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన కుటుంబాలను ఆదుకోవాలని కోరానని, చాలా మందికి సాయం అందలేదని ఈ విషయాన్ని తాను ప్రస్తావించానని చెప్పారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు కల్వకుంట్ల కవిత.
జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కల్వకుంట్ల కవిత శుక్రవారం అంబర్ పేటలో పర్యటించారు. ఈ సందర్బంగా స్థానికలతో సంభాషించారు. వారి సమస్యలను విన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీఎల్పీ నాయకుడు మహేశ్వర్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపించడం జరిగిందని చెప్పారు కవిత. ఇదే సమయంలో మాధవరంపై భగ్గుమన్నారు. తన కొడుకు ప్రణీత్ ప్రణవ్ విల్లాల్లో భాగంగా ఉన్నారని ఆరోపించారు. అక్కడ వారు ఒక సరస్సును ఆక్రమించి ప్రజలకు ప్రవేశం నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రాకు దమ్ముంటే ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. లీజుకు తీసుకున్న భూములను మార్చడం ద్వారా బీఆర్ఎస్ అవినీతికి కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ HILT ద్వారా తలుపులు తెరిచిందని సంచలన ఆరోపణలు చేశారు.






