సంచలన కామెంట్స్ చేసిన మొహమ్మద్ కైఫ్
ముంబై : భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్, అనలిస్ట్ మొహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తో పాటు జట్టు హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ను ఏకి పారేశాడు. ఈ ఇద్దరి నిర్వాకం కారణంగా ప్రతిభ కలిగిన ఆటగాళ్లు జట్టులోకి రాలేక పోతున్నారని ఆవేదన చెందాడు. ఎవరి మెప్పు కోసం ఇలా చేస్తున్నారంటూ నిలదీశాడు తన పాడ్ కాస్ట్ లో. తాజాగా కైఫ్ చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాలలో కలకలం రేపాయి. ఇప్పటికే దేశీవాళి క్రికెట్ టోర్నీలో దుమ్ము రేపుతూ సత్తా చాటినా ఇప్పటి వరకు తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదంటూ సంజూ శాంసన్ ను ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు. శుబ్ మన్ గిల్ వరుసగా ఫెయిల్యూర్ అవుతున్నా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని అన్నాడు. తను గత కొంత కాలంగా చూస్తే 30 టి20 మ్యాచ్ లు ఆడాడు. తను చేసిన రన్స్ 253 పరుగులు మాత్రమే. మరి శాంసన్ చేసిన తప్పేంటో గంభీర్ చెప్పాల్సిన అవసరం ఉందన్నాడు.
తక్షణమే గిల్ కు బ్రేక్ ఇవ్వాలని కోరాడు కైఫ్. అత్యున్నత నాణ్యత గల మ్యాచ్ విన్నర్ అయిన సంజు సామ్సన్, తనను విశ్వసించినప్పుడల్లా పదే పదే ప్రదర్శన ఇచ్చాడని గుర్తు చేశాడు. అయినప్పటికీ సరైన పరుగులు చేయకుండా విస్మరించ బడుతున్నాడని వాపోయాడు. జట్టు ఎంపికలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని కైఫ్ సరిగ్గానే ఎత్తి చూపాడు. గతంలో జట్టు సమతుల్యత అవసరమైనప్పుడు వైస్ కెప్టెన్‌లను కూడా తొలగించారని మరెందుకు ఆలస్యం చేస్తున్నారని అన్నాడు కైఫ్. గిల్‌కు విశ్రాంతి ఇచ్చి సంజుకు స్థిరమైన అవకాశం ఇవ్వడం జట్టు ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే, దానిలో తప్పు ఏమీ లేదన్నాడు.








