వైఎస్ఆర్ ఆశయాల కోసమే వచ్చా
కడప బిడ్డ పులివెందుల పులి
కడప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి అంటే ఓ బ్రాండ్ అన్నారు. ఈ కడప బిడ్డ పులివెందుల పులి అని కొనియాడారు వైఎస్ షర్మిల. తెల్లని పంచే కట్టు…మొహం నిండా చిరునవ్వు. ఇవ్వాళ్టి వరకు తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర.
సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలని నిరూపించిన నాయకుడు. ఇది వైఎస్సార్ మార్క్ అని పేర్కొన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఆయన తీసుకు వచ్చిన పథకాలే నేటికీ కొనసాగుతున్నాయని అన్నారు.
తాను వైఎస్సార్ ఆశయాలను సాధించేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. తన తండ్రి ఆశయాలను కొనసాగించలేని వారు ఆయన వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. జగన్ అన్నకి నేను వ్యతిరేకిని కాదని కానీ ఆయన అప్పటి మనిషి కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల.
రోజుకో జోకర్ ను తెచ్చి నాపై బురద చల్లుతున్నారు. నేను ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నా..హామీల వైఫల్యాల మీద మాట్లాడుతున్నా..ఎవరెంత నిందలు వేసినా…ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే వరకు, ప్రత్యేక హోదా వచ్చే వరకు..ఇక్కడ నుంచి కదలనని హెచ్చరించారు.