ప్రకటించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల : టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. 100 ఎకరాలలో టీటీడీ ఆధ్వర్యంలో దివ్య వృక్షాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఆగమ సంప్రదాయాల ప్రకారం ధ్వజ స్తంభాల తయారీలో సాధారణంగా టేకు, ఏగిశా/ ఇండియన్ కినో, టెర్మినేలియా, షోరియా జాతికి చెందిన వృక్షాలను వినియోగిస్తారని తెలిపారు. ఇవి బలంగా, దీర్ఘకాలికంగా నిటారుగా పెరిగే స్వభావం కలిగి ఉండటం వల్ల ధ్వజస్తంభం అవసరాలకు అనుకూలంగా ఉంటాయని అన్నారు. బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు.
పరిపక్వత చెందిన తర్వాత ఆ వృక్షాన్ని శాస్త్రోక్తంగా పూజించి, ఆపై ధ్వజస్తంభంగా రూపకల్పన చేస్తారని చెప్పారు. అనంతరం దానిని కవచంతో కప్పి, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం వంటి అత్యంత పవిత్ర ఆలయాల్లో స్వర్ణ కవచంతో అలంకరిస్తారని అన్నారు. రాజగోపురం, గర్భగుడి విమానం మధ్య పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించే ధ్వజ స్తంభంపై గరుడ ధ్వజాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు నాయుడు. సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని ప్రకటించే ఈ ధ్వజారోహణం సమస్త లోకాలోన్ని దేవతలను ఆహ్వానించే శుభ సూచకంగా నిలుస్తుందని అన్నారు.
దేశవ్యాప్తంగా 60కి పైగా ఆలయాలను నిర్వహిస్తున్న టీటీడీ, భవిష్యత్తులో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలను ఆగమ నియమాలకు అనుగుణంగా నిర్మించే బాధ్యతను దృష్టిలో ఉంచుకుని, ఈ దివ్య వృక్షాల ప్రాజెక్టును అత్యంత దూరదృష్టితో ప్రారంభిస్తోందన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భాగంగా సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దివ్య వృక్షాల ప్రాజెక్టు కోసం కేటాయించాలని టీటీడీ బోర్డు ప్రతిపాదించిందని స్పస్టం చేశారు బీఆర్ నాయుడు. ఈ ప్రాజెక్టు అమలుతో, ధ్వజస్తంభాల కోసం అవసరమైన దివ్య వృక్షాలను స్వయంగా పెంచే తొలి దేవాలయ సంస్థగా టీటీడీ దేశంలో చరిత్ర సృష్టించనుందని అన్నారు. దీని ద్వారా ఆగమ శుద్ధి, ఆధ్యాత్మిక పవిత్రత, పర్యావరణ బాధ్యత, సంస్థాగత స్వావలంబనను తరతరాలకు కొనసాగించ గలుగుతామని పేర్కొన్నారు.






