వైకుంఠ ఏకాదశికి పకడ్బందీగా ఏర్పాట్లు
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. సాధారణంగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసి, నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు. ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారని తెలిపారు.
ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ చేసిన ఏర్పాట్ల గురించి ఈవో సింఘాల్ వివరించారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల కోసం పగడ్బంది ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రెండు నెలలుగా అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహించి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, అన్న ప్రసాదాలు, వసతి, క్యూ లైన్ల నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలపై ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు.సీఎం నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు వైకుంఠ ఏకాదశిపై ప్రత్యేక బోర్డు సమావేశం నిర్వహించి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు.





